Sunday, July 31, 2016

మధుమేహం గురించి మ‌ద‌న‌ప‌డొద్దు‌..!

మధుమేహం గురించి మ‌ద‌న‌ప‌డొద్దు‌..!


                   మధుమేహం ఉందని తెలియగానే దిగులుపడతాం. ఆ దిగులు, ఆందోళన, టెన్షన్లే ఈ వ్యాధిని మరింత పెంచుతాయి కానీ, తగ్గించవు. ఈ వ్యాధి గురించిన పూర్తి చికిత్సా విధానం తెలియకపోవడం వల్లే ఇలా ఆందోళనపడటం సహజం. అది గ్రహించిన వి.జి.ఆర్‌ డయాబెటిస్‌ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ కె. వేణు గోపాల్‌రెడ్డి గత కొద్ది సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడే వారికోసం, వారంతా ఆరోగ్యంగా జీవించడం కోసం కొన్ని అవగాహనా కార్యక్రమాలను రూపొందించారు.
షుగర్‌ను ఎలా సమర్థవంతంగా నియంత్రించాలి? ఇది ప్రాణాంతకమవకుండా ఏం చేయాలి? షుగర్‌వల్ల దెబ్బతినే అవయవాలను ఎలా కాపాడుకోవాలి? అందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఆహార నియమాలు ఎలా ఉండాలనే అతి ముఖ్యమైన విషయాలు తెలియజెప్పారు. ఆ వివరాలు 'జీవన' పాఠకులకు ప్రత్యేకం.
మధుమేహ వ్యాధి ఇటీవల మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందని, హైదరాబాద్‌ మధుమేహ నగరంగా ముందుందుని సర్వే తెలుపుతోంది. చాపకింద నీరులా మధుమేహం వ్యాప్తి చెందుతోంది. ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మనదేశం ప్రసిద్ధికెక్కింది. సుమారుగా 50 మిలియన్లకి పైగా ఇప్పటికే మధుమేహం బారిన పడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80 మిలియన్లకి పెరగవచ్చని ఒక అంచనా.
దురదృష్టం కొద్దీ మధుమేహ వ్యాధి లక్షణాలు అంతగా ఇబ్బంది పెట్టేవి కాదు. అందుకే దానిని అంతగా పట్టించుకోం. నష్టం జరిగిన తరువాతగానీ అసలు వాస్తవం బయటపడదు. కాబట్టే దీనిని 'సైలెంట్‌ కిల్లర్‌' అంటారు.
మధుమేహం ఉందనేది, ఉన్నవాళ్లకు 50 శాతం మందికి తెలియనే తెలియదు. తెలుసుకున్న వాళ్లలో 50 శాతం మంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకుంటున్నారు. మధుమేహం వల్ల నరాలు, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్ర పిండాలు, కళ్లు, పాదాల్లాంటి ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహం గురించి అందరూ తప్పక తెలుసుకొని, దాని నుంచి రక్షణ పొందాలి.
రావడానికి ఎవరికి అవకాశం ఉంది?
కుటుంబంలో తల్లిదండ్రులకు ముధుమేహం ఉంటే
అధిక బరువు, ఊబకాయం ఉన్నవాళ్లు
ఎక్కువ శ్రమలేని జీవితాన్ని గడుపుతున్న వాళ్లు
ఎక్కువ ఒత్తిడికి గురవుతున్న వాళ్లు
కొలెస్ట్రాల్‌ (లేక) ట్రైగ్లిజరైడ్‌ స్థాయి ఎక్కువగా ఉన్నవాళ్లు
నాలుగు కిలోల బరువున్న శిశువుకు జన్మనిచ్చిన స్త్రీ
స్టెరాయిడ్‌ మందులు తీసుకునేవాళ్లకు
రిస్క్‌ ఎలా ఉంటుంది?
తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉంటే-99%
తల్లిదండ్రులో ఒకరికి మధుమేహం ఉండి రెండోవాళ్ల
బంధువులెవరికైనా మధుమేహం ఉంటే -75%
బంధువులెవరికైనా మధుమేహం ఉంటే - 50%
తల్లిదండ్రులకుగాక దగ్గర బంధువులకెవరికైనా
మధుమేహం ఉంటే -25%
చేయించుకోవలసిన పరీక్షలు
ఫాస్టింగ్‌, పోస్ట్‌లంచ్‌ బ్లడ్‌షుగర్‌ - నెలకోసారి
గ్లైకోజిలేటెడ్‌ హీమోగ్లోబిన్‌ - 2-3 నెలలకోసారి
లిఫిడ్‌ప్రొఫైల్‌ - సంవత్సరానికి ఒక్కసారి
కిడ్నీ పరీక్షలు - యూరియా, క్రియాటినైన్‌,
ఆరు నెలలకు ఒకసారి
మైక్రో ఆల్బుమిన్‌ - సంవత్సరానికి ఒక్కసారి
గుండె, లివర్‌, పాదాలను - సంవత్సరానికి ఒక్కసారి
కన్ను- రెటీనా గురించి - సంవత్సరానికి ఒక్కసారి
కేవలం బ్లడ్‌ షుగర్‌ పరీక్షలు చేయిస్తే చాలదు. ప్రతీ ఏడాది కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయం, నరాలు, పాదాలు పరీక్ష చేయించుకుంటూ జాగ్రత్తపడాలి.
ఒకటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి మధుమేహం అదుపులో లేనివాళ్లలో ఈ అవయవాలు నిశబ్ధంగా దెబ్బతింటాయి. అది బయటపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
వ్యాధి లక్షణాలు
తరచుగా మూత్ర విసర్జన చేయడం
అతిగా దాహం వేయడం
అతిగా ఆకలి వేయడం
బరువు తగ్గిపోవడం
చూపు మందగించడం
పుండ్లు త్వరగా మానకపోవటం
బాగా నీరసం, నిస్సత్తువ
మర్మావయవాల దగ్గర ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ రావడం
తెలుసుకోవడానికి
ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌ -126mg/dl ఉన్నా అంతకన్నా ఎక్కువగా ఉన్నా మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి.
గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌లో బ్లడ్‌షుగర్‌ 75mg  గ్లూకోజ్‌ తీసుకున్న రెండుగంటలకు 200mg/dl ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్న మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి.
అలాగే రాండమ్‌ బ్లడ్‌ షుగర్‌ 200mg/dl ఉన్నా, అంతకన్నా ఎక్కువగా ఉన్నా మధుమేహం ఉన్నట్లు గుర్తించాలి.
ఫాస్టింగ్‌ బ్లడ్‌షుగర్‌ 100`125 mg/dl మధ్య, ఆహారం తీసుకున్న తరువాత 140 mg/dl- 199 mg/dl ఉన్నవాళ్లని ప్రీ డయాబెటిక్‌ స్టేజీలో ఉన్నట్లుగా గుర్తించవచ్చు. వీళ్లకు భవిష్యత్‌లో షుగర్‌ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
గుండెజబ్బులు
మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 50-60 శాతం మంది గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులతో భాదపడుతున్నట్లు పరీక్షలు తెలుపుతున్నాయి. టైప్‌-2 డయాబెటిస్‌తో బాధపడుతూ మరణించిన వాళ్లల్లో మూడు వంతులు గుండెనాళాలకు సంబంధించిన వ్యాధుల కారణాల వల్లే అని పరిశోధనల్లో తేలింది.
మూత్రపిండాలు
మధుమేహం ఎక్కువ కాలం అదుపులో లేకుండా ఉంటే ఆ ప్రభావం మూత్రపిండాల మీద పడవచ్చు. మూత్రపిండాలకు డయాబెటిక్‌ నెఫ్రోపతి వస్తుంది. ఇది వస్తే క్రమంగా మూత్రపిండాలు పాడైపోతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడంతోనే డయాబెటిక్‌ నెఫ్రోపతిని అదుపులో ఉంచుకోవచ్చు.
పాదాలు
మధుమేహం వల్ల క్రమంగా రక్తనాళాలే కాదు, నరాలూ దెబ్బతింటాయి. ముఖ్యంగా శరీరం చివర ఉండే నరాలు దెబ్బతింటాయి. కాబట్టి మధుమేహమంటే పెరిఫెరల్‌ న్యూరోపతి వస్తుందని భయపడుతుంటారు. పాదాలలో, అరచేతుల్లో ఉన్న నరాలు, దెబ్బతినే ముందు తిమ్మిర్లు వస్తాయి. ఆ తర్వాత స్వర్మజ్ఞానం క్రమంగా తగ్గిపోతుంది. అలాంటప్పుడు పాదాలలో ఏమి గుచ్చుకున్నా తెలీదు.
కన్ను
మధుమేహం అదుపులో లేనివారిలో ముందుగా కన్ను వెనుకఃభాగంలో ఉండే రెటీనా అనే పొరలోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినటం జరుగుతుంది. దానివలన చివరకు అంధత్వం కూడా సంభవించవచ్చు.
చికిత్స
మధుమేహం వ్యాధి చికిత్సలో నాలుగు ముఖ్యమైన అంశాలను మనం తప్పకుండా పాటించాలి. అందులో
మొదటిది:
సరైన ఆహార నియమాలను పాటించడం.
రెండవది:
రెగ్యులర్‌గా వ్యాయమం చేయడం.
మూడవది:
క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం.
నాల్గవది:
వ్యాధి గురించి పూర్తి అవగాహన కలిగి ఉండటం.
పైన చెప్పిన ఈ నాలుగు అంశాలను చక్కగా పాటించడం ద్వారా మనం మధుమేహం వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోగలం. దీనివల్ల ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి వీలు కలుగుతుంది.

http://www.prajasakti.com/Content/1655505

No comments: